మతం

ఎందుకో ఉన్నట్టుండి నిజమైన మతమేది? అసలు దేవుడు ఒక్కడే అయినపుడు ఇన్ని మతాలు ఎందుకు? వాటిలో వివిధ తెగలెందుకు? మతాలన్ని ముక్తిని పొందే మార్గాన్నే సూచిస్తే మతం పేర మనుషుల మద్య వివాదాలు, కలహాలెందుకు? ఒకడేమో త్రితత్వం అని, మరొకరేమో వెలుగు రూపం అని ఇంకొకరు కనబడ్డ ప్రతిది దేవుడే అని మనుషల మధ్య అపోహలెందుకు? అని నాలో మొదలైన ప్రశ్నల పరంపర నుండే  వాటికి సమాధానము తెలుసుకోవాలనే తపన నాలో పెరిగింది. సంపూర్ణంగా కాకపోయిన ఏదో కొంత మేరకైన తెలుసుకున్నాను. మనిషి తర్కం నుండేగా కొత్త ఆలోచనలకు, ఆవిష్కరణలకు బీజం పడేది.

'మతం' అంటే ఏమిటి అనేది మనలో ఎంత మందికి తెలుసు? మనలో చాలా మంది అసలు మతం అంటేనే ఏమిటో తెలియకుండానే ఏదో మన పూర్వీకులు ఆచరించారుగా అని దానినే గ్రుడ్డిగా ఆచరించడం తప్ప.

'మతం' అన్న పదానికి అసలు నిర్వచనం 'ధర్మం' అని, అంటే మనం తప్పక అవలంభించవలసిన విధులని అర్ధం. అసలు నువ్వు ఎందుకు చేస్తున్నవో, ఏమి చేస్తున్నవో తెలియనపుడు దానిని ఆచరించడమే నిరర్ధకమే కదా మరి. అటువంటిదే మతం కుడాను. ఏది తెలియకుండా మతాన్ని ఆచరించడం అంటే గమ్యం లేని నావ పయనం లాంటిది.